4-yr-old girl's rape: డీఏవీ పాఠశాల గుర్తింపు తక్షణమే రద్దు : మంత్రి ఆదేశం

4-yr-old girl's rape: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని.. పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యాశాఖ అధికారిదేనని మంత్రి తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీసు విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు.
ఈ కమిటీ తన నివేదిక వారం రోజుల్లో ఇస్తుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీ పత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com