eetala: కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయను: ఈటల

కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్‌లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్ ఇంటికి శనివారం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. హుజురాబాద్ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని ఉద్ఘాటించారు. ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని ఉద్ఘాటించారు. తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. దక్షిణ భారతదేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం పెట్టారని గుర్తుచేశారు ఎంపీ ఈటల రాజేందర్.
ఏదైనా స్ట్రైట్ ఫార్వార్డ్
‘‘గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు నా నిర్ణయాలు మొహమాటం లేకుండా చెప్పాను. గతంలో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. గతంలో హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో నా ఓటమికి చాలా మంది కుట్రలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నేను పోరాటాలు చేస్తే కరీంనగర్ ప్రజలు అండగా ఉండేవారు. హుజూరాబాద్ గడ్డలో ప్రతి గ్రామంలోని వార్డు సభ్యుడిని గెలిపిస్తాం. కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం మాకు చేతకాదు. పైకి ఒక మాట.. లోపల మరో మాట మాట్లాడటం తెలియదు. శత్రువుతో నేరుగా కొట్లాడతా. స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన చరిత్ర నాది." అని ఈటల స్పష్టం చేశారు. "హుజూరాబాద్ వస్తా.. మీ వెంటే ఉంటా.. స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకుంటా.’’అని ఈటల అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com