TS: తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం

TS: తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం
ఎన్నికల హామీలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న పార్టీలు... ప్రచారంలో దిగ్గజ నేతలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముమ్మరంగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్‌ పార్టీ .. లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుపు బావుటా ఎగురవేసేందుకు సమాయత్తమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే బయ్యారం ఉక్కు పరిశ్రమను తీసుకొస్తానని మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ వెల్లడించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకున్న మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్.. సార్వత్రిక ఎన్నికల్లో 'ఇండియా కూటమి' అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి.. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస రైతులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో .. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లోని నివాసంలో సమావేశం నిర్వహించారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట్‌లో పర్యటించారు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను పరిష్కరించిన ప్రధాని మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, అరవై అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. పేదలకు ఇచ్చిన హామీలు నేరవేర్చి కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు అడగాలని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Tags

Next Story