Counting Centers in Hyderabad: హైదరాబాద్​లో రేపు 144 సెక్షన్ - వైన్ షాప్స్ బంద్

Counting Centers in Hyderabad:  హైదరాబాద్​లో రేపు 144 సెక్షన్ - వైన్ షాప్స్ బంద్
X
కౌంటింగ్​ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాలున్నాయి. ఒకే చోట పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా వెంటనే అడ్డుకునేలా అడుగడుగునా సిబ్బందిని మెహరించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. మద్యం దుకాణాలు మూసేయాలని తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధుల్ని మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, రికార్డింగ్‌ చేసే అవకాశమున్నవి, ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని లోపలికి అనుమతించరు. సిబ్బంది ఎవరైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.

తొలి దశలో స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారు. వీరు కౌంటింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపేసి నిషేధిత వస్తువులున్నాయో లేదో తనిఖీ చేసి పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రెండో దశలోనూ ఏఆర్, ఎస్పీఎఫ్‌ పోలీసులు తనిఖీ చేస్తారు. వీరు కౌంటింగ్‌ ఏజెంట్లను, ఎన్నికల సిబ్బందిని వేర్వేరు మార్గాల్లో లోపలికి పంపిస్తారు. మూడో దశలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరోసారి తనిఖీ చేశాక లోపలికి పంపిస్తారు.

కౌంటింగ్ కేంద్రలోకి వెళ్లాక ఒక హాలులో ఉండే వ్యక్తి ఇంకో హాలులోకి వెళ్లడానికి వీల్లేదు. ఉదాహరణకు చేవెళ్ల కౌంటింగ్‌ కేంద్రంలో 8 హాళ్లు ఉన్నాయి. ఇందులో కౌంటింగ్‌ ఏజెంటు నిర్దేశిత అసెంబ్లీకి సంబంధించిన హాలులో మాత్రమే ఉండాలి. మరో హాలులోకి వెళ్లకూడదు. ఏజెంట్లు, అధికారులకు ఆహారం, శౌచాలయం అన్ని వసతులు కల్పిస్తారు. తరచూ బయటకు రాకపోకలు సాగించకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్‌ హాలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది.

నిబంధనలను ఉల్లంఘించి కౌంటింగ్‌ కేంద్రంలో చిత్రీకరిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఈసీ తెలిపింది. ఇందుకు అనుగుణంగా పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీతో కలిసి భద్రతా ఏర్పాట్లుపై సమన్వయం చేసుకుంటున్నారు. కాగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ఒకటి, మల్కాజిగిరిలో 03, హైదరాబాద్​లో 7, సికింద్రాబాద్​లో 7, చేవెళ్ల లో1 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

Tags

Next Story