ELECTION: నేడే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ నేటికి వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషన్ కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇందుకు నిరాకరించిన న్యాయస్థానం నోటిఫికేషన్ యథావిధిగా ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం నేడు యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం లీగల్ టీమ్‌తో చర్చించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత విచారణ ప్రారంభమవగానే.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి మధ్యాహ్నం హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించరాదన్నారు. విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. బీసీ ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తాం’’ అని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారం మధ్యాహ్నానానికి వాయిదా వేసింది. ఈరోజు విచారణపై ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com