ELECTIONS: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డట్టేనా?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సరికొత్త చర్చకు దారి తీశాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించింది. దీని ప్రకారం జీవో 9 పై స్టే విధించింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఇదివరకే షెడ్యూల్ జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 9 ప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీని ఆధారంగానే 2,963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీసీ స్థానాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు నామినేషన్లు సైతం దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ జీవోపై స్టే విధించింది. దీని ప్రకారం దాఖలైన నామినేషన్ల పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. అదే విధంగా జీవో నంబర్ 9 ఆధారంగా షెడ్యూల్ ఇచ్చిన మిగతా స్థానాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది. పాత పద్దతి ప్రకారం ఎన్నికలకు వెళ్తే మొత్తం రిజర్వేషన్లు మారిపోతాయి. కొత్త పద్ధతికి జీవో అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది చర్చనీయాంశంగా మారింది.
బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్9 అమలుపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్ద లాగేసినట్లయిందని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామన్నారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. ‘‘హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తాం. సుప్రీం కోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం. కోర్టులో కేసులు వేయించింది భారత రాష్ట్ర సమితే. భాజపాతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించాం’’ అని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com