ELECTIONS: మోగిన స్థానిక నగారా... గ్రామాల్లో రాజకీయ వేడి

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణికుముదిని వెల్లడించారు. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో రెండు విడతల్లో 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై.. నవంబర్ 9తో ముగుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు, పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పోలింగ్ రోజు సాయంత్రమే వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలను నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికుముదిని వివరించారు.
తేలిన ఓటర్ల లెక్క..
రాష్ట్రంలో గ్రామీణ జనాభా1.95 కోట్లు ఉండగా.. గ్రామీణ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో మహిళా ఓటర్లు 85,35,935, పురుషు ఓటర్లు 81,66,732 మంది ఉండగా.. ఇతరులు 501మంది ఉన్నారు. గ్రామీణ ఓటర్ల జాబితాలో సింహభాగం మహిళలే ఉండటం విశేషం.. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అతివల ఓట్లు కీలకం కానున్నాయి. పురుష ఓటర్ల కంటే దాదాపు 4 లక్షలపైగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలు, ఏపీవోలకు జిల్లాల్లో శిక్షణ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయాల వేడి పెరిగింది. ఇప్పటికే ఆశావహులు ప్రచారాన్ని ప్రారంభించగా రిజర్వేషన్లతో కొందరు అసంతృప్తికి గురయ్యారు. ఇక రానున్న రోజుల్లో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల వేడి మరింత పెరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com