RAHUL: ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్లే
ప్రధాని నరేంద్రమోదీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ బాండ్ల జాబితాను చూస్తే ప్రతి ఒక్కరికి అందులోని కుంభకోణం అర్థమవుతుందన్నారు.దేశంలో ప్రతిచోటుకు మోదీ రావడానికి ముందే ఈడీ వస్తుందన్న రాహుల్ మోదీ ముందు అంతా అవినీతిపరులే ఉన్నారని హైదరాబాద్ తుక్కుగూడ సభలో ఆక్షేపించారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన రాహుల్ వేలాదిమంది ఫోన్లను ట్యాప్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.
హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ లాంఛనంగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిన్ననే దిల్లీలో విడుదల చేయగా తుక్కుగూడ సభలో రాహుల్ విడుదల చేశారు. కొన్ని నెలల క్రితం తుక్కుగూడలోనే తెలంగాణకు గ్యారంటీ కార్డు విడుదల చేసినట్టు గుర్తుచేశారు. ఆ గ్యారంటీలలో గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు హామీలను అమల్లోకి తెచ్చామని, ఇప్పటికే 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్న రాహుల్... కేంద్రంలో
అధికారానికి వస్తే... తెలంగాణలో నెరవేర్చినట్టే అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్.. మోదీ సర్కార్ ధనవంతులకే 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిందన్నారు. రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని మోదీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందన్నారు. అందుకే అవినీతిపరులందరినీ భాజపాలోకి చేర్చుకుంటోందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్ బీఆర్‌ఎస్‌ను ఓడించినట్టే కేంద్రంలో బీజేపీనే ఓడిస్తామని చెప్పిన రాహుల్ తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ వేలాదిమంది ఫోన్‌లు ట్యాప్ చేయించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్రంలో మూడోసారి బీజేపీకి అవకాశమిస్తే రాజ్యాంగాన్నే రద్దుచేస్తారన్న రాహుల్
అలాంటి అవకాశమివ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘నాకు ప్రజలకు ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం. మనందరిదీ కుటుంబ సంబంధం. తెలంగాణ ప్రజల సిపాయిలా దిల్లీలో ఉంటా. నా జీవితాంతం చిన్న పిల్లలు పిలిచినా తెలంగాణ వస్తా. ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం. ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపాలి. ‘మేడిన్ చైనా’ కంటే మిన్నగా ‘ మేడిన్ తెలంగాణ’ కావాలి.’’ అని రాహుల్ ఆకాంక్షించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com