Etela Rajendar : ప్రజలు ధర్మం వైపే ఉన్నారు.. ఇక ఆట మొదలైంది..!

Etela Rajendar : సీఎం కేసీఆర్... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు ఈటల రాజేందర్. హుజురాబాద్ గెలుపు నేపథ్యంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్‌కు సన్మాన సభ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై ఈటలను ఘనంగా సన్మానించారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని... కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందని ఈటల విమర్శించారు. ఆత్మగౌరవం ముందు... కేసీఆర్ ప్లాన్‌లు నిలబడలేదన్నారు. ప్రజలు ధర్మం వైపే ఉన్నారని... ఇక ఆట మొదలైందన్నారు. తన గెలుపు హుజురాబాద్ ప్రజలకు అంకితమన్నారు ఈటల రాజేందర్.
నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్ పని చేశారని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అబద్ధాలు చెప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఎన్నిక... రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే దళిత బంధు పథకం తెచ్చారన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేథావులు పని చేశారన్నారు కిషన్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం మానుకొని.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈనెల 8న అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల దగ్గర నిరసన ప్రదర్శనకు దిగుతామన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు. దళిత బంధుతో ప్రజలను మోసం చేస్తున్నారని... రాష్ట్రమంతటా ఈ పథకం అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com