Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.? ఈటల ఎపిసోడ్‌తో..!

Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఈటల ఎపిసోడ్ నడుస్తోంది.. పార్టీలో కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.. పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించకుండా తన పని తాను చేసుకుపోతున్నారనే చర్చ పార్టీలో నడుస్తోంది.. దీంతో జాతీయ నాయకత్వం ఈటలను బుజ్జగించే పనిలో పడింది.. ఈటల చేరిక ద్వారా పార్టీకి బలం పెరిగిందని భావిస్తున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు.. పార్టీలో ఆయన రోల్ పెంచడం ద్వారా మరింత బలాన్ని తీసుకురావచ్చని ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సుమారు 40 నిమిషాలపాటు ఈటల చర్చించారు.. ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ బలాబలాలను ఈటల ద్వారా అమిత్ షా తెలుసుకున్నట్లు సమాచారం. ఈ వివరాల ఆధారంగా రాబోయే రోజుల్లో అమిత్ షా తన మార్క్ రాజకీయాలను రాష్ట్రంలో చేపట్టబోతున్నారని చర్చ సాగుతోంది.
ఇంత వరకు బాగానే ఉన్నా ఈటల ఢిల్లీ పర్యటనపై మరో వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ పార్టీ కోసం పనిచేయడం మానేసి తన సొంత పరపతి పెంచుకునేందుకే ఎక్కువగా దృష్టి సారిస్తారని ఆ వర్గం నేతలు విమర్శిస్తున్నారు. తాము కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశామని.. కానీ, ఎక్కడున్నా పదవుల కోసం పాకులాడలేదని మనసులో ఉన్న ఆక్రోశాన్నంతా వెళ్లగక్కుతున్నారు.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాటి నుంచి ఈటల వ్యవహారం ఇలాగే ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము కూడా జాతీయ నాయకులను కలుస్తామని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అమిత్ షాతో తమకు కూడా అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్‌షాతో సమావేశంపై ఈటల కావాలనే లీకులు ఇచ్చి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. తాము కూడా అమిత్ షాను కలిసి కార్యాచరణ వివరిస్తామని చెప్తున్నారు. ఓ వైపు ఈటల రాజేందర్.. మరోవైపు తెలంగాణ ఉద్యమకారుల మధ్య రగులుతున్న వివాదాన్ని రాష్ట్ర నాయకత్వం ఎలా చల్లారుస్తుంది..? అందరూ కలుపుకుని పోయేలా నాయకత్వం ఎలాంటి వ్యూహరచన చేస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com