Etela Rajender : అలా అన్నందుకే ఈటలపై అసెంబ్లీ సస్పెన్షన్ వేటు..

Etela Rajender : అలా అన్నందుకే ఈటలపై అసెంబ్లీ సస్పెన్షన్ వేటు..
X
Etela Rajender : తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు

Etela Rajender : తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. స్పీకర్‌ను మర మనిషి అన్నారంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల క్షమాపణలు చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మాటల యద్ధం నడిచింది.

బెదిరిస్తున్నారా అంటూ ఈటల ఫైరయ్యారు. తాను సభలో 19 ఏళ్లు పూర్తి చేసుకున్నానని తెలిపారు. సభలో మాట్లాడే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు. ఈటల క్షమాపణలు చెప్పకపోవడంతో.. సభ నుంచి సస్పెన్షన్‌ చేయాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు. దీంతో ఈ సెషన్‌ వరకు ఈటలను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

అనంతరం అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. సస్పెన్షన్‌ చేసిన తర్వాత అరెస్ట్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. బానిసలా వ్యవహరించొద్దంటూ నిప్పులు చెరిగారు. ఏడాది కాలంగా కుట్ర చేస్తున్నారని.. గెలిచినప్పటి నుంచి సభకు హాజరుకాకుండా చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించనన్నారు. ఈటలను పోలీసులు ఆయన ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు.

మరమనిషి అంటే సస్పెన్షన్‌ చేస్తారా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌. ఈటల రాజేందర్‌ అన్నదాంట్లో తప్పేముందన్నారు. కేంద్రాన్ని తిట్టడానికే మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించట్లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈటల సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై భగ్గుమన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈటలను సభలోకి రానివ్వకుండా.. మాట్లాడనివ్వకుండా ఫాసిస్టులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈటలను చూడటం ఇష్టం లేకపోతే సీఎం కేసీఆర్‌ సభను బహిష్కరించాలన్నారు. కేసీఆర్‌ను సభ నుంచి శాశ్వతంగా పంపించివేయాలన్నారు.

ప్రభుత్వం బీజేపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని నేతలు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.

Tags

Next Story