Etela Rajender: ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం.. బీజేపీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్..

Etela Rajender (tv5news.in)
Etela Rajender: హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ఏడోసారి బీజేపీ అభ్యర్థిగా ప్రమాణం చేశారు. అంతకుముందు.. గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు ఈటల.
భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయడాన్ని అవమానంగా భావించిన ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. 24వేలపైగా ఓట్ల ఆధిక్యంతో హుజురాబాద్‌లో విజయం సాధించి ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి రాజాసింగ్, రఘునందన్ రావు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు రాజేందర్ తోడు కావడంతో RRR కాంబినేషన్ ఏర్పడిందంటున్నారు బీజేపీ నేతలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు ఈటల. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈటల చురుకైన పాత్ర పోషించనున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com