జగద్గురు శ్రీరామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు సర్వం సిద్ధం

జగద్గురు శ్రీరామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు సర్వం సిద్ధం
X
కులమతాలకు అతీతంగా సమానత్వ సిద్ధాంతానికి పాటుపడిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరం ముస్తాబైంది.

కులమతాలకు అతీతంగా సమానత్వ సిద్ధాంతానికి పాటుపడిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరం ముస్తాబైంది. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. స్వయంగా త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ సహస్రాబ్ది వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది. 108 దివ్యదేశాల ప్రతిష్టాపన, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమతామూర్తి లోకార్పణ జరగనుంది.

12 రోజుల మహాక్రతువులో ప్రధానమైన యాగశాలలో యజ్ఞాలకు ఏర్పాట్లు చేశారు. వెయ్యి 35 కుండాలలో మహాయజ్ఞం జరగనుంది. ఈ మహాయాగాన్ని నిర్వహించేందుకు 5 వేల మంది రుత్వికులు ఆశ్రమానికి చేరుకున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక సహా అమెరికా నుంచి వచ్చారు. యాగానికి అవసరమైన పది వేల పాత్రలను రాజస్థాన్ నుంచి తెప్పించారు. యాగశాలను.. వాలంటీర్లు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు.

ప్రతి రోజు ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన హోమాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి అరగంట పాటు విష్టు సహస్రనామ పారాయణం ఉంటుంది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఈ వేడుకల్లో సేవలందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలందించనున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 20 జిల్లాలు సహా మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు. యాగశాల, సమతామూర్తి విగ్రహం, ఆహారశాలలు వంటి వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవలు అందించనున్నారు.

రామానుజాచార్య ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు విశిష్ట అతిథులుగా రానున్నట్లు చినజీయర్ స్వామి వెల్లడించారు. సామాన్యుల నుంచి ధీమాన్యుల వరకు అన్నిరకాల సేవలను అందిస్తూ సమతామూర్తి స్ఫూర్తిని ఆవిష్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతో పాటు.. సహస్రాబ్ది వేడుకలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 7 వేల మంది పోలీసులు సమతామూర్తి కేంద్రంలో 24 గంటల పాటు పహారా కాయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పోలీసులు పూర్తిగా సమతామూర్తి కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Tags

Next Story