BJP: వరంగల్ పార్లమెంటు స్ధానానికి ఆరూరి రమేష్ ?

BJP: వరంగల్ పార్లమెంటు స్ధానానికి ఆరూరి రమేష్ ?
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్..

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన భారాస నేత ఆరూరి రమేష్... ఎట్టకేలకు భాజాపా తీర్ధం పుచ్చుకున్నారు. గులాబీ జెండా వదిలేసి కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో..ఆరూరి పార్టీలో చేరారు.

ఆరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకునే క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఆరూరి భారాసను వీడి కమలం గూటికి చేరతారన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. భారాస నుంచి పోటీ చేస్తే... గెలవడం కష్టమని ఆయన భావించారు. గత ఎన్నికల్లో తనకు పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్లే ఓటమి చెందానన్నది ఆయన ఆవేదన. వరంగల్ పార్లమెంటు అభ్యర్ధిత్వం కడియం కావ్యకు అధిష్టానం ఇచ్చే ఉద్దేశం ఉందని తెలియడం వల్ల ఇక భాజాపాలోకి వెళ్లేందుకే మానసికంగా సిద్ధమయ్యారు. భారాస పెద్దలు జోక్యం చేసుకుని వరంగల్ లోక్‌సభ సీటు ఖాయమని చెప్పి ఆరూరిని బుజ్జగించారు. తాను భారాసను వీడి భాజపాలో చేరట్లేదని శ్రేణులను గందరగోళపరచడానికి ఈ విధమైన ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు.

ఆరూరి రమేష్ చేసిన ప్రకటన కొన్ని రోజులు పార్టీ మార్పు ఊహాగానాలను తెరదించింది. నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోయిన వారంలో హైదరాబాద్‌లో అమిత్ షా రాక సందర్భంగా కమలం నాయకులను కలిశారు. ఆరూరి రమేష్ భాజపా నేతలను కలసిన ఫోటోలు వీడియోలు బయటికిరాగా... పార్టీ మారడం ఖాయమైంది. దీనిపై ఆరూరి మాట్లాడేందుకు కొద్దిసేపు ముందు... భారాస నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బసవరాజ్ సారయ్య తదితరులు వచ్చి ఆయనను బలవతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు. మధ్యాహ్నానికి KCR సమక్షంలో జరిగిన వరంగల్ నేతల సమావేశంలో ఆరూరి పాల్గొన్నారు. భారాసలోనే కొనసాగుతున్నానని.. తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని అభ్యర్ధి ఎవరైనా వారి గెలుపుకోసం పని చేస్తానని తెలిపారు.

ఎట్టకేలకు భాజపాలో ఆరూరి రమేష్ చేరికతో పార్టీ మార్పు అంకానికి తెరపడింది. పోను పోనంటూనే కమలం గూటికి చేరి తను అనుకున్నదే చేసి భారాసకు గట్టి షాక్ ఇచ్చారని ఆరూరి అనుచరులు పేర్కొంటున్నారు. వరంగల్ పార్లమెంటు స్ధానానికి భాజపా అభ్యర్థిగా ఆయన పేరు లాంఛనమే కానుందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story