TS: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఛైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఛైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. ఛైర్మన్ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com