ED: కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఒక్కరే ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరవ్వాలని భావించినా.. అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ కార్ రేసు ఒప్పందానికి సంబంధానికి బంధించిన పత్రాలు... నగదు బదిలీ చేసిన దస్త్రాలను కేటీఆర్ ముందు ఉంచి పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ సంస్థకు నిధులు బదిలీపై ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం.
ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణలో భాగంగా ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
భారీ బందోబస్తు
బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. మరోవైపు ఈడీ కార్యాలయానికి పెద్దసంఖ్యలో భారాస కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫార్ములా-ఈరేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది.
ఇప్పటికే ఈడీ విచారణ
దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్ణణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com