తెలంగాణలో తీవ్రమవుతున్న కరోనా మందుల కొరత..!

తెలంగాణలో కరోనా మరోమారు విజృంభిస్తోంది. ఇదే సమయంలో ఆస్పత్రుల్లో మందుల కొరత కూడా తీవ్రం కావడంతో రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజూ వేలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వారిలో చాలా మందికి స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే శ్వాస ఇబ్బందుల్లాంటి తీవ్ర లక్షణాలున్న వారికి మాత్రం.. ఆక్సీజన్‌తో పాటు, రెమెడిసివిర్ ఇంజెక్షన్లను ఇవ్వాల్సి వస్తోంది. ఇన్ని రోజులు పరిమిత సంఖ్యలోనే పేషెంట్లు ఉండడంతో... ఇంజెక్షన్ల విషయంలో ఇబ్బంది తలెత్తలేదు. కానీ గత 15 రోజులుగా... ఆస్పత్రులకు తరలివస్తున్న రోగుల సంఖ్య పెరగడంతో... మందుల కొరత తీవ్రమైంది. రెండు రోజులైనా ఇంజెక్షన్ దొరకని పరిస్థితి ఉందని రోగుల బంధువులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, పెద్ద పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల్లో మందులు అందుబాటులోనే ఉన్నా... చిన్న చిన్నప్రైవేటు ఆస్పత్రుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. రోగులందరికీ ట్రీట్‌మెంట్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన స్థాయిలో మందులు సరఫరా చేయడం లేదని.. ప్రైవేటు హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు... ప్రస్తుతం నెలకొన్న మందుల కొరత కృత్రిమమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనార్జన కోసం వ్యాపార వర్గాలే ఉద్దేశపూర్వకంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరత సృష్టిస్తున్నాయని కరోనా బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com