KAVITHA: కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీ
మద్యం కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈనెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కవిత అరెస్ట్‌పై ఢిల్లీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కవిత అరెస్ట్ అక్రమమని ఆమె న్యాయవాది వాదించగా అన్ని పరిశీలించాకే అరెస్ట్ చేశామని ఈడీ వాదించింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా... ఈడీ తరపున న్యాయవాదులు స్పెషల్ పీపీ ఎన్.కె మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. తొలుత వాదనలు వినిపించిన కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి...సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు.
కవితకు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్న కవిత తరపు న్యాయవాది... గతేడాది సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వబోమని, అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో అదనపు సోలిసిటర్ జనరల్ మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని వాదించారు. ఈడీ ఇచ్చిన సమన్లు, నమోదు చేసిన కేసును నిలిపేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఓ వైపు విచారణ జరుగుతుండగానే వితను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ CRPC 160 కింద నోటీసులు ఇచ్చి.. 2022 డిసెంబర్ లో ఇంటికి వచ్చి విచారించిందన్న ఆయన... కవితను సీబీఐ సాక్షి అంటుంటే ఈడీ నిందితురాలు అంటోందని అన్నారు. ఇందులో ఏదీ నిజమని ప్రశ్నించారు.
PMLA చట్టం CRPC సెక్షన్లు వర్తిస్తాయని చెపుతుండగా ఈడీ అధికారులు మాత్రం అవి వర్తించవంటున్నారని అన్నారు. ఒక మహిళను అరెస్టు చేసి, 30 కిలోమీటర్లు పైగా తీసుకువెళ్తే తప్పకుండా ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి కానీ అదేదీ లేకుండానే అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలించారని అన్నారు. సుప్రీం కోర్టులో పిటిషన్ పై విచారణ జరుతోంది...మధ్యంతర ఉత్తర్వులున్నాయి...దర్యాప్తునకు సహకరిస్తుండగా...ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం ...ఈడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జోయబ్ హుస్సేన్...తీవ్ర చర్యలుండవని ఎప్పుడు, ఎక్కడ అండర్ టేకింగ్ ఇవ్వలేదన్నారు. ఏ న్యాయస్థానామూ... తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. 10 రోజుల పాటు సమన్లు జారీ చేయబోమని మాత్రమే చెప్పామని.... అది చాలా కాలం క్రితమే ఐపోయిందని అన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది జనవరి 3న సమన్లు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ సమన్లను సవాల్ చేస్తూ...సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసుంటే... ఆ పిటిషన్ ఎక్కడుందో చెప్పాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం...కవితను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రతిరోజు కుటుంబసభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు అవకాశమిచ్చిన కోర్టు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించింది. కస్టడీ ముగిసిన అనంతరం ఈనెల 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com