POLICE: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనఫైడ్లు
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో పలువురు తప్పుడు బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దాదాపు 60 మంది తప్పుడు పత్రాలు దాఖలు చేసినట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. వీరంతా హైదరాబాద్ పరిధిలో ఉద్యోగం పొందేందుకు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్లు సమర్పించినట్లు వెల్లడైంది. ఇప్పటికే వీరికి శిక్షణను నిలిపేసిన అధికారులు... తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. తప్పుడు బోనఫైడ్ పత్రాలు సమర్పించిన కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను అధికారులు తెలంగాణ పోలీసు నియామక మండలికి పంపారు. నియామక ప్రక్రియ విధివిధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేసినందున T.S.L.P.R.B సూచన మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే నకిలీ బోనఫైడ్లు ఇచ్చిన పాఠశాలలు, తీసుకున్న అభ్యర్థుల మీద కేసులు నమోదు చేసే అవకాశముంది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఈ లెక్కన హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ పోటీ కొంత తక్కువగానూ ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు అభ్యర్థులు... హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లో చదవకపోయినా, ఇక్కడే ప్రాథమిక విద్యనభ్యసించినట్లు నకిలీ బోనఫైడ్లు తీసుకుని... T.S.L.P.R.Bకి సమర్పించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో దాదాపు 350 మంది దాకా రెండు జిల్లాల్లో ప్రాథమిక విద్య చదివినట్లు బోనఫైడ్లు సమర్పించారు. అనుమానాస్పదంగా భావించిన అధికారులు వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టి రెండోసారి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ల ఆధారంగా... చదివిన పాఠశాల, ఆ సమయంలోని రిజిస్టర్లు, ఇతర ఆధారాలతో పోల్చి చూడగా దాదాపు 290 మందివి నిజమేనని తేలింది. 60 మంది మాత్రం ఉద్దేశపూర్వకంగా నకిలీవి ఇచ్చినట్లు బయటపడింది.
హైదరాబాద్ స్థానికత చూపించి ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఈ పని చేసినట్లు అధికారులు వెల్లడించారు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన ఈ 60 మందిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com