నకిలీ పాస్‌పోర్టుల కలకలం.. ఏఎస్సై ఇంటి చిరునామాతో 32 మందికి పాస్ పోర్టులు

నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన నకిలీ పాస్‌పోర్టుల స్కామ్‌పై దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. బోధన్ నుంచి రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఓ ఎస్సై, మరో ఏఎస్సైపై వేటు వేశారు. వారిని కూడా అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.
బోధన్ నుంచి ఎంతమంది రోహింగ్యాలకు పాస్‌పోర్టులు జారీ అయ్యాయనే లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు 75 మంది ఇలా పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వెరిఫికేషన్‌లోనూ లోపాలున్నట్లు తేల్చారు.
కొందరు రోహింగ్యాలు గత నెల 26న పాస్‌పోర్టుపై ఇతర దేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇవాళ హోంశాఖకు పోలీసులు నివేదిక ఇవ్వనున్నారు. మరో 67 మంది ఆచూకి తెలియరాలేదు. వీరంతా దుబాయ్ వెళ్లినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 2014 నుంచి ఇప్పటి వరకు.. గత ఆరేళ్లలో జారీ అయిన పాస్‌పోర్టులను పరిశీలిస్తున్నారు. ఒకే ఇంటి నుంచి 32 పాస్‌పోర్టులు జారీ అయినట్లు గుర్తించారు. ఆ ఇల్లు.. అప్పట్లో ఏఎస్సైగా పనిచేసిన మల్లేశ్‌కు సంబంధించిందని నిర్ధారించారు. ఆయనను సస్పెండ్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా చేర్చి, అరెస్టు చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఏఎస్సై అనిల్ కూడా.. ఈ వ్యవహారంలో సహకారం అందించినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. ఇద్దరు మీ-సేవ నిర్వాహకులు, నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
బంగ్లాదేశీయుడైన ఓ వ్యక్తి బోధన్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. బంగ్లాదేశ్ కు చెందిన ఆయుర్వేద డాక్టర్ పరిమళన్‌గా స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. 2014లో అతను కొందరు యువకులను బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి బోధన్‌కు రప్పించి.. వారికి ఏఎస్సై మల్లేశ్ ఇంట్లో అద్దెకు దింపాడు. అలా.. ఆ ఇంటి చిరునామాతో 32 పాస్‌పోర్టులు పొందారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఒకే ఫోన్ నంబరును ఇచ్చారు. ఇలా మరికొందరు యువకులు కూడా.. ఆ ఇంటి చుట్టుపక్కల ఉంటూ.. పాస్‌పోర్టు వచ్చాక వెళ్లిపోయినట్లు పోలీసులు తేల్చారు.
అప్పట్లో స్పెషల్ బ్రాంచ్ పనిచేసిన ఓ అధికారి సహకారం వల్లే.. ఇంత మంది సులభంగా పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించారు. మీ-సేవ నిర్వాహకుల సహకారంతో వారు సులభంగా పాస్‌పోర్టులు తీసుకున్నట్లు తేల్చారు. సూత్రధారి పరిమళన్ పాటు పుణెకు చెందిన ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు తీసుకున్న కేసులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులు పాస్‌పోర్టులు తీసుకున్నారని.. వాటి ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వారిని గుర్తించామని ఆయన వివరించారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం ఇమ్మిగ్రేషన్, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖలు రాశామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com