FARMERS: బస్తా యూరియా కోసం రైతన్నల పడిగాపులు

రైతులకు బస్తా యూరియా సంపాదించడం గగనమవుతోంది. పొట్టదశకు చేరుకుంటున్న వరికి, పూత దశకొస్తున్న పత్తి పంట సహా ఇతర పంటలకు చల్లేందుకు యూరియా దొరక్కపోవడంతో రైతులు గోస పడుతున్నారు. పంటలకు ఎరువులు లేకపోతే దిగుబడి తగ్గుతుందనే ఆందోళనతో తెల్లవారముందే కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఓపిగ్గా క్యూలో నిల్చుంటున్నారు. యూరియా ఇవ్వాలంటూ కొన్నిచోట్ల సిబ్బంది కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల ఓపిక నశించి కన్నెర్ర చేస్తున్నారు. రాస్తారోకోలతో ఆందోళనలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు గురువారం కూడా తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి.
రక్తం చిందించిన రైతు..
యూరియా బస్తాల కోసం తెలంగాణ రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మల్లమ్మ కుంట తండాకు చెందిన అజ్మీరా లక్క, విజయ అనే దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకలేదు. ఇవాళ ఇస్తున్నారని తెలిసి భార్య భర్తలు వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. అయితే లక్కకు గతంలో పక్షపాతం వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. లైన్లో నిలబడి ఒక్కసారిగా సొమ్మసిల్లి మెట్ల పైనుంచి కింద పడడంతో తల పగిలి గాయమైంది. . వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లక్కను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల కష్టాలను చూసి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు
రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వానాకాలం సీజన్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలు ఎదుగుదల దశలో ఉండగా.. వరి నాట్లకు ఉపయోగించే దశలో సరిపడా నిల్వల్లేక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది మొక్కజొన్న, వరి పంటలు విస్తీర్ణం పెరగడం వాటికి ఒకేసారి యూరియా అవసరం కావడంతో డిమాండ్ పెరిగినట్లు తెలిసింది. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్లలో కేవలం 250 బస్తాల యూరియా రాగా 500 మంది రైతులు వచ్చారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు కేవలం ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుచూపు వైఖరి లేకపోవడం వల్ల రైతుల పట్ల ఉదాసీన వైఖరి అవలంబించడంతో రైతులు యూరియా కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికలాంగులు వృద్ధులు మహిళలు కూడా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
50 వేల మెట్రిక్ టన్నుల యూరియా
ఇక తెలంగాణకు 50వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ యూరియాను ఈ వారంలోనే సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో చేసిన నిరసన ప్రదర్శనతో కేంద్రానికి పరిస్థితులు తెలిశాయని తెలిపారు. కాగా కర్ణాటక నుంచి 10,800 టన్నుల యూరియా మొదటి షిప్మెంట్ ప్రారంభమైందని.. ఈవారంలో మరో మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరా చేయాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. కొందరు బీఆర్ఎస్ నేతలు వారి అనుచరులను యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూలైన్లో పెట్టి యూరియా కొరతపై రైతాంగం ఆందోళన చెందే విధంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. ఆగస్టు 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా... ఇప్పటివరకు 5.42 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com