రైతు సంఘాలతో అర్ధాంతరంగా ముగిసిన కేంద్రం చర్చలు

రైతు సంఘాలతో అర్ధాంతరంగా ముగిసిన కేంద్రం చర్చలు
X

ప్రతీకాత్మక చిత్రం 

ఐదోసారి కూడా చర్చలు సఫలం కాలేదు. రైతులతో సమావేశమైన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో రైతులతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. రైతుల నుంచి తీవ్ర నిరసన రావడంతో వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్ర అంగీకరించింది. రైతులకు మేలుచేసేందుకే చట్టాన్ని తీసుకొచ్చామని చెబుతూ వచ్చిన కేంద్రం.. రైతుల నిరవదిక నిరసనతో దిగిరాక తప్పలేదు. పైగా రైతుల ఆందోళనకు దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలే గాక, విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. దీంతో రైతుల డిమాండ్ల పరిష్కారంపై కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, తోమర్‌, పీయూష్‌ గోయల్‌తో మోదీ సుదీర్ఘంగా చర్చించారు. అన్నదాతల ప్రతిపాదనల మేరకు వ్యవసాయ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం భావించింది.

సవరణల విషయంపై ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేతృత్వంలో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిగాయి. కనీస మద్దతు ధర విషయంలోనూ తాము హామీ ఇవ్వడానికి సిద్ధమేనని నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. చర్చల్లో భాగంగా పంటల మద్దతు ధరకు హామీ, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో పాటు కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి సమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించే అవకాశాలపై కేంద్రం రైతులకు హామీ ఇచ్చింది. ప్రైవేట్ మండీలలో రిజిస్ట్రర్డ్‌ సంస్థలకే కొనుగోలు అవకాశం ఇస్తామని, సవరణల కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని రైతులకు చెప్పింది. ఈ విషయంపై న్యాయ శాఖతో కూడా వ్యవసాయ శాఖ చర్చలు జరిపింది.

అయితే రైతులు మాత్రం.. సవరణలు వద్దని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని భీష్మించారు. తాము ఆశించినట్టు చేయలేకపోతే చర్చల నుంచి వాకౌట్ చేస్తామని కూడా చెప్పాయి. కొత్త చట్టం ముసాయిదా తయారీకి రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. రైతు కమిషన్‌లో కేవలం రైతులకు మాత్రమే స్థానం కల్పించాలని.. నిపుణులు, ఉన్నతాధికారులను చేర్చవద్దని, రైతు కమిషన్ ముసాయిదాతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరాయి. అయితే, వ్యవసాయ మంత్రి తోమర్.. సమావేశాల నుంచి వెళ్లిపోవడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.


Tags

Next Story