మంచిర్యాల ప్రజలను వెంటాడుతోన్న పులి భయం

మంచిర్యాల జిల్లాలో ప్రజలను పులి భయం వెంటాడుతోంది. తాజాగా.. మైసమ్మ గుట్ట వద్ద పులి కనిపించినట్లు ఓ వ్యక్తి చెప్పడంతో కలకలం రేగింది. చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లు వెల్లడించాడు. కొత్తపల్లి మండలం నక్కపల్లికి బైక్‌పై వెళ్తుండగా మైసమ్మ గుట్ట వద్ద పులి కనిపించిందని.. దీంతో బైక్ పడేసి చెట్టెక్కానని చెప్పాడు. ఫోన్ చేసి విషయం గ్రామస్తులకు తెలిపానన్నాడు. అక్కడికి వచ్చిన గ్రామస్తులు.. పులి జాడలు గుర్తించారు.
మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లా వాసులను పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు గడపదాటి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మనుషుల రక్తం మరిగిన పెద్దపులి.. వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ప్రజలు. ఓ వైపు ఫారెస్ట్ సిబ్బంది పెద్దపులిని పట్టుకునేందుకు 4 వారాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతాన్ని ఎక్కడికక్కడ జల్లెడపడుతున్నారు. అడవిలో బోన్లు ఏర్పాటు చేసినా ఎక్కడా చిక్కడం లేదు.
దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ అనే 19 ఏళ్ల యువకుడిని... గత నెల 11న గ్రామ సమీపంలోని వాగు పక్కన హతమార్చింది. 18 రోజుల తర్వాత.. మళ్లీ కొండపల్లిలో నిర్మల అనే బాలికను పొట్టనబెట్టుకుంది. ఇటీవల పెంచికల్ పేట్ మండలం ఆగర్‌గూడ వద్ద పెద్దవాగు సమీపంలో పులి గ్రామస్తులకు కనిపించి మళ్లీ వణికించింది. ఈ మూడు ప్రాంతాలు.. 5 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. పెద్దపులి భయంతో.. రైతులు పొలాల్లో వెళ్లడానికి భయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com