Secunderabad: అగ్నిపథ్ నిరసనలు.. స్పందిస్తున్న రాజకీయ నాయకులు..

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక ఘటన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల ముసుగులో కొందరు విధ్వంసం సృష్టించారన్నారు. ప్రభుత్వం కనీసం హింసను ఆపే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసే విధ్వంసానికి కుట్ర చేశాయన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు. ఇక ఆర్మీ విద్యార్థులకు అన్యాయం జరగదని.. వాళ్ల భవిష్యత్ బాధ్యత కేంద్రానిదన్నారు. అన్యాయం చేసే వ్యక్తి మోడీ కాదన్నారు బండి సంజయ్. ఆర్మీ విద్యార్థులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి, ఆర్మీ విద్యార్ధులకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమేనని, తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. రైల్వే స్టేషన్‌పై దాడిచేయడానికి పక్కా ప్లాన్‌తో వచ్చారని.. ఇంటెలిజెన్స్ వాళ్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అన్నీ ఆలోచించే అగ్నిపథ్ ప్రవేశపెట్టారని.. విద్యార్ధులకు, దేశానికి మేలు చేసేందుకే ఈ పథకం తీసుకొచ్చారన్నారు.
అగ్నిపథ్ పథకాన్ని ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసను చూసైనా సరే.. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని సలహా ఇచ్చారు. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో.. ఈ హింసాత్మక ఘటనలు చూస్తే అర్థమవుతోందన్నారు కేటీఆర్. వన్ ర్యాంక్-వన్ పొజిషన్ నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ వైపు పయనిస్తున్నారంటూ కేంద్ర విధానాన్ని విమర్శించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే సికింద్రాబాద్‌లో విధ్వంసం సృష్టించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో రైలు తగులబెట్టిన ఘటనను ఆయన ఖండించారు. అగ్నిపథ్ ప్రకటించి రెండ్రోజులు కాలేదని.. అప్పుడే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేశాయని ఆరోపించారు. అగ్నిపథ్ లాంటి పథకం అనేక దేశాల్లో ఉందని గుర్తుచేశారు.
జాతీయభావం తీసుకురావడంలో భాగంగానే అగ్నిపథ్ తీసుకువస్తున్నామని చెప్పారు. అగ్నిపథ్ కంపల్సరీ స్కీం కాదని.. స్వచ్ఛందంగా స్కీంలో భాగం కావొచ్చన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సమస్య రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న కిషన్ రెడ్డి.. కుట్ర వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com