Telangana Budget 2022-23 : రూ.2 లక్షల 70 వేల కోట్ల అంచనాతో బడ్జెట్.. సంక్షేమ కార్యక్రమాలకే పెద్దపీట..!

Telangana Budget 2022-23 : తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అంచనాల్లో 20 శాతం వరకూ పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. సుమారుగా 2 లక్షల 70 వేల కోట్లతో ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాళ సమావేశాలు ఉదయం 11.30కి మొదలవుతాయి. ఆ వెంటనే బడ్జెట్ ఉంటుంది. TRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితబంధుకు ఈ బడ్జెట్‌లో 20 వేల కోట్లకుపైనే కేటాయింపులు చేసే అవకాశం ఉందంటున్నారు.
రైతుబంధు, పెన్షన్లు లాంటి పథకాలతోపాటు దళితబంధు కూడా కీలకంగా భావిస్తున్న CMకేసీఆర్.. అందుకు తగ్గట్టు కేటాయింపులపై ఆర్థికశాఖ అధికారులతో పలుమార్లు సమీక్షించారు. ఎలాంటి షరతులు లేకుండా దళితబంధును అమలు చేస్తున్న నేపథ్యంలో తొలి ఏడాది ఎంత కేటాయింపులు చేయాలనే దానిపైనా పెద్ద కసరత్తే చేశారు. ఈసారికి దీన్ని 20 వేల కోట్ల వరకూ ఇచ్చి.. రైతుబంధుకు 15 వేల కోట్లు, ఆసరాకు 14 వేల కోట్లు ఇవ్వనున్నారు. మొత్తంగా చూస్తే బడ్జెట్‌లో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చే నిధులు, చేసే కేటాయింపులు 1 లక్ష కోట్ల వరకూ ఉండబోతున్నాయి.
బడ్జెట్ అంచనాలు 20 శాతం వరకూ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో భారీగా వృద్ధి ఉండడమే కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా కష్టాలు తొలగిపోయినందున.. ఆదాయం క్రమంగా పెరుగుతోంది. GSDP రేటు కూడా 19.1 శాతానికి పెరగడంతో ఈసారి పరిస్థితులు బాగానే ఉండబోతున్నాయి. జీఎస్టీ, అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్లతోపాటు భూముల అమ్మకాలు వంటి రూపాల్లోనూ వచ్చే ఆదాయం లెక్కలు వేసి దాన్ని బట్టి కేటాయింపులు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ 8 ఏళ్లలోనే తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఎదుగుతోంది అంటే దానికెనుక ఎంతో పకడ్బందీ ప్రణాళిక ఉందని TRS వర్గాలు చెప్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com