Telangana Jobs : 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

Telangana : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థికశాఖ. మొత్తం 30,453 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నియామక సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ... శాఖల వారీగా ఆర్థిక శాఖ జీవోలు విడుదల చేసింది. గ్రూప్-1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖ వైద్య ఆరోగ్య శాఖల్లో భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు టెట్ నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
ఇటీవల అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దీనికి అనుగుణంగా..మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సభ్యులుగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని ఉప సంఘం.. సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో పలుసార్లు చర్చించింది. తొలి విడతగా 30 వేల 453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీఎం ప్రకటించిన 80 వేల 39 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1లో 503 పోస్టులు, పోలీసు నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారి -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ -38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40 పోస్టులు భర్తీ చేస్తారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష - టెట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష - టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ సారి టెట్ అర్హతల్లో మార్పులు చేసింది. ఎన్‌సీటీఈ ఆదేశాల మేరకు టెట్ పేపర్ -2కు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని తెలిపింది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ అభ్యర్థులకు అర్హత రానుంది. అయితే, ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక.. టెట్ అర్హత కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి సవరించింది.
రాష్ట్రంలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.ఉపాధ్యాయ నియామకాలకు వీలుగా మేలో టెట్ నిర్వహించనుంది విద్యాశాఖ. సుమారు 3లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్ జారీ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com