Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం -

Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం -
X
శాసనసభా వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం

రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని శాసనసభ వేదికగా ప్రభుత్వం ఆవిష్కరించనుంది. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, అప్పుల గణాంకాలతో కూడిన శ్వేత పత్రాన్ని రాష్ట్ర సర్కారు విడుదల చేయనుంది. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి వస్తున్న ఆదాయం, చేసిన ఖర్చు, తీసుకున్న అప్పులను... తొమ్మిదిన్నరేళ్లు KCR సర్కారు అనుసరించిన విధానాలతో పోల్చనుంది. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 6 గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు కార్యాచరణను సర్కారు ప్రకటించనుంది.

శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల కానుంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి.... రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం.... మొదటి సమావేశాల్లోనే ఆదాయం, వ్యయాలు, అప్పుల గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రమాణస్వీకారం చేసిన రోజే CM రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్వహించారు. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని తయారు చేసింది. 2014 జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావం మొదలు... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2023 డిసెంబర్ ఏడో తేదీ వరకు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించేలా దీన్ని సిద్ధం చేశారు.

ప్రధానంగా ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు, తదితరాలకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రాన్ని రూపొందించారు. KCR ప్రభుత్వం హయాంలో తీసుకున్న రుణాలపై ఎక్కువగా దృష్టి సారించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అప్పులమయం చేశారో వివరించాలన్న ప్రధాన ఉద్దేశంతో రేవంత్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేస్తోంది. FRBM చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలతో పాటు విద్యుత్ కార్పొరేషన్లు, పౌరసరఫరాల సంస్థ, నీటిపారుదల ప్రాజెక్టుల కార్పొరేషన్లు, మిషన్ భగీరథ కార్పొరేషన్, తదితర సంస్థల ద్వారా తీసుకున్న రుణాల పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యుత్ వ్యవస్థలు, పౌరసరఫరాల సంస్థ భారీగా అప్పుల్లో కూరుకుపోయాయని... అన్ని శాఖల పరిస్థితి కూడా ఇంతే ఉందని ప్రభుత్వం తెలిపింది. కార్పొరేషన్ల పేరిట భారీగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని... ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆక్షేపించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేశారన్న ప్రభుత్వం... గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించినట్లు పేర్కొంది.

రుణాల మొత్తంలో ఇప్పటివరకు చేసిన చెల్లింపులు, ఇంకా చేయాల్సిన మొత్తం, ప్రతినెలా చెల్లిస్తున్న వడ్డీ, అసలు, ఖజానా పై ఉన్న భారం, తదితర అన్ని అంశాలను శ్వేత పత్రం ద్వారా వివరించనున్నారు. ఖజానాకు వచ్చిన ఆదాయం, అప్పుల ద్వారా సమకూరిన మొత్తాన్ని ఖర్చు చేసిన ప్రాధాన్యతా రంగాలు... వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలను కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం ఉంది. శ్వేతపత్రం తయారీకి సంబంధించి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత కొన్నాళ్లుగా అధికారులతో విస్తృత కసరత్తు చేశారు. ఉన్నతాధికారులతో పాటు విశ్రాంత IASలు, నిపుణుల సహకారం కూడా తీసుకున్నట్లు సమాచారం. అన్నింటినీ క్రోడీకరించి 10 నుంచి 15 ప్రధాన అంశాల ఆధారంగా శ్వేతపత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది..

Tags

Next Story