FIRE ACCIDENT: పాతబస్తీలో పెను విషాదం

FIRE ACCIDENT: పాతబస్తీలో పెను విషాదం
X
చార్మినార్‌ పక్కన భారీ అగ్ని ప్రమాదం... 17మంది సజీవ దహనం

భాగ్య నగరం పెను విషాదంలో కూరుకుపోయింది. చిన్నారులు, వృద్ధులు, తల్లులు అగ్నికీలలకు బలవ్వడంతో బోరుమన్నారు. చార్మినార్‌కు కూతవేటు దూరంలోని జరిగిన మృత్యుఘోష యావత్ దేశాన్ని దిగ్ర్భాంతి పరిచింది. తెల్లవారుతూనే మరణ మృదంగం అందరినీ శోక సంద్రంలో ముంచేసింది. చుట్టాల ఇంటికి వచ్చిన బెంగాల్‌కు చెందిన నాలుగు కుటుంబాలకు చెందిన 17 మంది అగ్ని ప్రమాదంలో బలవ్వడం తీవ్ర వేదనను మిగిల్చింది. విధి ఆడిన వింత నాటకంలో అనుకోకుండా ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో.. శోకాలతో మార్మోగిపోయింది.

ఉలిక్కిపడిన భాగ్యనగరం

హైదరాబాద్‌ ఉలిక్కిపడింది. భాగ్య నగరంలోని పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున.. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ దారుణ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉండగా, స్పాట్‌లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మలక్‌పేట యశోదలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. కంచన్‌బాగ్ అపోలోలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ రెండు చోట్ల నుంచి 10 మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గుల్జార్ హౌస్‌ చౌరస్తాలో ఓ నగల వ్యాపారీ భవనం ఉంది. ఇది జీప్లస్ 2 బిల్డింగ్. దీంట్లోనే నగల వ్యాపారీ, వర్కర్లు 20 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటలతోపాటు.. దట్టంగా పొగ అలుముకుంది. దీంతో 16 మంది వరకు స్పృహతప్పి పడిపోయారు. కింద నుంచి పైకి వెళ్లడానికి ఒకే మెట్ల మార్గం ఉంది. అది కూడా ఇరుగ్గా ఉండటంతో.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విద్యుదాఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఏసీ కంప్రెసర్‌ పేలి మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దీని కారణంగా విషపూరితమైన వాయువులు, దట్టమైన పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకున్న వారంతా ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

చుట్టాల ఇంటికి వచ్చిన వారు...

చుట్టాల ఇంటికి వచ్చి అనంతలోకాలకు చేరకున్నారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారు ఇటీవల తమ బంధువుల ఇంటికి పశ్చిమ బెంగాల్ నుండి వచ్చినట్లు తెలిసింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ వ్యక్తి నగల దుకాణం నిర్వహిస్తుండగా.. అతడి ఇంటికి బెంగాల్ నుంచి నాలుగు కుటుంబాలకు చెందిన చుట్టాలు వచ్చారు. గత రాత్రి మొదటి అంతస్తులో నిద్రపోయిన బంధువుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. యితే ఆ గదిలో ఓ మహిళ తన పిల్లలు రక్షించుకునేందుకు చివరి ప్రయత్నంగా వారిని తన కౌగింట్లోకి తీసుకుంది. కానీ, దురదృష్టవశాత్తు వాళ్లు ఆ మంటల్లో కాలిపోయారు. మంటలు ఆర్పిన తర్వాత.. ఆ తల్లి, ఆమె కౌగిట్లో పిల్లలు అలాగే చనిపోయి ఉన్నారు. ఆ దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగలేదు అంటూ ప్రత్యక్ష సాక్షి జహీర్ వెల్లడించారు. ఇలాంటి విషాద దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Tags

Next Story