దీపావళి వేళ తెలంగాణలో బాణసంచా నిషేధం.. వ్యాపారులు ఆందోళన

దీపావళి వేళ తెలంగాణలో బాణసంచా నిషేధం.. వ్యాపారులు ఆందోళన
X

దీపావళి వేళ తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది ఇంద్రప్రకాశ్‌ వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి కరోనా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు ఇప్పటికే నిషేధించాయని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. నిషేధంపై ప్రభుత్వ వైఖరేంటని అడ్వకేట్‌ జనరల్‌ను ప్రశ్నించగా.. దీనిపై ఒక నిర్దిష్ట పాలసీ రూపొందించలేదని.. ఎన్జీటీ మార్గదర్శకాలు పాటిస్తూ, అవసరమైన ఆంక్షలు విధిస్తామని వివరించారు.

కరోనా తీవ్రత ఉన్నట్టుగా ప్రభుత్వమే చెబుతుందని కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బాణసంచా కాల్చడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. బాణసంచా అమ్మకాలు, కాల్చడాన్ని నిషేధించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నారని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. వాటన్నింటినీ నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేసింది హైకోర్టు. బాణాసంచాపై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందనే అంశాలు, కారణాలతో ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయాన్ని నివేదిక రూపంలో ఈ నెల 19న అందించాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇప్పటికే ఢిల్లీ సహా కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్‌ ప్రభుత్వాలు నిషేధం విధిస్తూ ప్రకటన చేశాయి. హరియాణా సైతం పాక్షికంగా నిషేధం విధించింది. వాయు కాలుష్యంతో కరోనా బారిన పడిన వారి ఆరోగ్యం మరింత క్లిష్లమయ్యే ప్రమాదముందని.. టపాసులు కాల్చేందుకు దూరంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజలకు సూచించింది. పశ్చిమ్‌బెంగాల్‌లోనూ కాళీమాత పూజల సందర్భంగా బాణసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బాణసంచా నిషేధంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతగానో బాధించిందని క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా దీపావళికి రూ.200 కోట్ల మేర బాణసంచా అమ్మకాలు జరుగుతాయన్నారు. నిషేధించే ఉద్దేశం ఉన్నట్లయితే అనుమతులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. బాణాసంచా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు హోల్ సేల్ వ్యాపారులకు 6 నెలల కింద చెబితే బాగుండేదన్నారు. విక్రయాలకు మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమ్మకాలకు అనుమతి ఇవ్వకపోతే పెద్ద మొత్తంలో నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story