అన్నం పెట్టిన వలే అతడి ప్రాణాలు తీసింది..

అలలకి ఎదురెళ్లి వల వేసి చేపలు పట్టడం అతడి విధి. కుటుంబాన్ని పోషించుకోవడానికి అదే ఆధారం. కానీ చేపలు పట్టే వలే యమపాశమై అతడి ప్రాణాలు తీసింది. గోదావరి నదిలో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకునే తొందూర్ నాగేశ్ (45) చేపల కోసం తాను కట్టిన వలకే ప్రమాదవశాత్తు చిక్కుకుని మృతి చెందిన సంఘటన బాసరలో చోటు చేసుకుంది. రోజు లాగే శనివారం కూడా చేపలు పట్టేందుకు నది వద్దకు వెళ్లాడు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. అనుకోకుండా తాను వేసిన వలలోనే చిక్కుకున్నాడు. నీటిలో మునిగిపోతున్న నాగేశ్‌ను ఒడ్డుపై ఉన్న తోటి జాలర్లు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతడు వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.
అంతకు ముందు ఎందరివో ప్రాణాలు కాపాడిన పేరు అతడికి ఉంది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు ప్రమాదవశాత్తు నీట మునిగితే నాగేశ్ వారిని ఒడ్డుకు చేర్చేవాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని గోదావరి నదిలో దూకిన పలువురిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చేవాడు. అలాంటి నాగేశ ఆ నదిలోనే అతడు వేసిన వలలోనే చిక్కుక్కుని ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. మృతుడికి భార్య, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com