TS: తెలంగాణ నుంచి అయిదుగురికి పద్మ పురస్కారాలు

TS: తెలంగాణ నుంచి అయిదుగురికి పద్మ పురస్కారాలు
మట్టిలో మాణిక్యాలకు అవార్టులు... అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులకు పద్మ పురస్కారాలు వరించాయి. పెద్దగా ప్రచారానికి నోచుకోని మట్టిలో మాణిక్యాలకు అవార్డుల ఎంపికలో పట్టం కట్టారు. తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. చిందు యక్షగానంలో గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప, గ్రంథాలయ ఉద్యమకారుడు కూరెళ్ల విఠలాచార్య, స్థపతి వేలు ఆనందాచారి, భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన కేతావత్‌ సోమ్లాల్‌కు పురస్కారాలు వరించాయి. చిందు యక్షగానంలో పేరొందిన గడ్డం సమ్మయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవురుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన... తండ్రి రామస్వామి నుంచే కళను పుణికుపుచ్చుకున్నారు. ఐదో తరగతి చదివిన సమ్మయ్య 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ.. యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా 19 వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతోపాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు.


బుర్ర వీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం నారాయణపేట జిల్లా దామరగిద్ద. ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేస్తారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతోపాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెబుతున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. గతంలో దూరదర్శన్‌లోనూ ప్రదర్శనలిచ్చారు. దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప, వెంకటమ్మ. తన బుర్ర వీణను తానే తయారుచేస్తారు. బలగం సినిమాలో అయ్యే శివుడా ఏమాయే పాటను పాటినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని ఓ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బుర్రవీణపై శిక్షణ ఇచ్చారు. ఇప్పుడూ కొందరికి నేర్పిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండగలు జరిగినప్పుడు బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే జీవిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్యకు మధుర కవిగా గుర్తింపు ఉంది. 2014లో తన ఇంటినే గ్రంథాలయంగా చేసి 5 వేల పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం అందులో రెండు లక్షలకు పైగా పుస్తకాలున్నాయి. ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలయం ఉపయుక్తంగా మారింది. ఇప్పటికే ఇక్కడ పరిశోధనలు చేసిన వారు.. 8 మంది విద్యార్థులు PHD సాధించారంటే ఇక్కడి పుస్తకాల విశిష్ఠత తీరును గమనించవచ్చు. ఈయన చేస్తున్న కృషిని ఇటీవల ప్రధాని.. తన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించి అభినందించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో జన్మించిన వేలు ఆనందాచారి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయశాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు.. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేశారు. తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story