FLOOD LOSS: వరద మిగిల్చిన నష్టం రూ.558.90 కోట్లు

తెలంగాణలో వర్షాలు తగ్గినా, వరదలు శాంతించినా వాటి మిగులు ప్రభావం గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు భారీ వర్షాలతో అల్లకల్లోలమయ్యాయి. కామారెడ్డిలో మాత్రమే రూ.130 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 33 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలతో శ్రీరామసాగర్ జలాశయం వెనుక జలాలు పోటెత్తి, నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు కలిపి 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం చోటుచేసుకుంది. 480 చెరువులు, కాలువలు, కుంటలు గండ్లు పడగా, మరమ్మతులకు రూ.100 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. రోడ్లు-భవనాల శాఖ పరిధిలో 784 ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వీటికి దాదాపు రూ.558.90 కోట్లతో పూర్తి స్థాయి మరమ్మతులు అవసరమని అధికారులు చెబుతున్నారు. వరదల దెబ్బతో పంటలే కాక మౌలిక వసతులు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ప్రభుత్వం ప్రాధమిక అంచనాలను సిద్ధం చేసుకుని, బాధితులకు తక్షణ సహాయ ప్యాకేజీలను అందించడానికి చర్యలు చేపడుతోంది.
వరద గుప్పిట బాసర
నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వరదనీరు వ్యాసమహర్షి ఆలయం, ఆలయ ఆవరణలోని గృహాలు, దుకాణాలు, ప్రైవేట్ లాడ్జ్‌లు, సత్రాలను మునిగించాయి. గంగాదేవి, సూర్యేశ్వర శివాలయం, అక్షర కాలనీ, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్‌లు నీట మునిగాయి. అక్షర కాలనీలో చిక్కుకున్నవారిని ట్రాక్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక నాగభూషణ్ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు వెళ్లిన మరో 8 మంది కూడా వరదలో చిక్కిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com