Munneru Floods : మున్నేరు వాగు మహోగ్రరూపం

ఖమ్మం జిల్లాలోని మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరుణగిరి వద్ద సాయి కృష్ణ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం చేస్తున్నారన్నారు. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతోపాటు.. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. అంతకుముందు ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపైకి వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని బయటకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అప్పటికే స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచి బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు. తొమ్మిది గంటల ఉత్కంఠకు తెరపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మున్నేరు వాగు వరద ధాటికి ములకలపల్లి వంతెన కొట్టుకుపోయింది. ఖమ్మం-మహబూబాబాద్ జిల్లాల వారధిగా ఉన్న ములకలపల్లి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఖమ్మం-మహబూబాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. పాలేరు ప్రవాహానికి కొట్టుకుపోయిన జాతీయ రహదారి : మరోవైపు పాలేరు వరద ఉద్ధృతికి కూసుమంచి వద్ద ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో పాలేరు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి 65 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 26.5 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఆదివారం పాలేరు ప్రవాహంలో కొట్టుకుపోయిన యాకూబ్ మృతదేహం లభ్యమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com