Telangana news: నిండిన జలశయాలు.. పెరిగిన భూగర్భ జలాలు

Telangana news: నిండిన జలశయాలు.. పెరిగిన భూగర్భ జలాలు
X
వ్యవసాయ రంగానికి బిగ్ రీలిఫ్

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం మవుతోంది. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తడిసిముద్దయ్యింది. దీంతో రాష్ర్టంలోని జలశయాలు కళకళలాడుతున్నాయి. పంటలకు ఊపిరొచ్చింది. అలాగే భూగర్భ జలాలు పెరిగినట్టు అధికారులు తెలుపుతున్నారు. గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అటు రైతుల్లో ఇటు ప్రభుత్వంలో ఆందోళన నెలకొన్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు దంచికొడుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అలుగెక్కి మత్తడి దూకుతున్నాయి.

నిండుకుండల్లా జలశయాలు..

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు 3,80,200 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షలు, నాగార్జునసాగర్‌కు 4,83,766 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 60,419 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 78 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, ఎల్లంపల్లికి 1.48 లక్షల ప్రవాహం వస్తున్నది. సింగూర్‌కు 13,07 6 క్యూసెక్కులు, నిజాంసాగర్‌కు 28,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మొత్తం 25 గేట్లకు గాను 13 గేట్లు పూర్తిగా, 12 గేట్లు రెండు అడుగులమేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌ ఉగ్రరూపం దాల్చింది. ఈ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా 28 అడుగులకు పైగా నీరు వచ్చి చేరింది.

గరిష్ట స్థాయికి చేరిన ఉస్మాన్, హిమయత్ సాగర్లు

హైదరాబాద్‌ శివారులోని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఉస్మాన్‌సాగర్ గరిష్ఠస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. 1782.45 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. హిమాయత్‌సాగర్‌ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1756.60 అడుగలకు చేరుకుంది.

పెరిగిన భూగర్భ జలాలు

ఇప్పుడు తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంటు లెక్కల ప్రకారం గతేడాది జూలైలో భూగర్భ జల‌మట్టం మొత్తం 33 జిల్లాలను సగటుగా తీసుకుంటే 6.17 మీటర్లు. ఈ సంవత్సరం జూన్‌లో వచ్చిన వర్షాలతో అది 8.29 మీటర్ల స్థాయికి చేరుకుని పరిస్థితి కొంత మెరుగుపడింది. జూలై చివరి నాటికి 3.93 మీటర్లకు పెరిగాయి. అన్ని జిల్లాలను కలిపి సగటుగా తీసుకుంటే గతేడాది జూలైలో 6.17 మీటర్ల నుంచి ఈ సంవత్సరం మే నెలలో 10.58 మీటర్లకు, జూన్‌లో 9.90 మీటర్లకు, జూలైలో 8.25 మీటర్లకు చేరుకున్నాయి.

వ్యవసాయ రంగానికి బిగ్ రీలిఫ్

తుపాను కారణంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు పంటలకు ఉపశమనం కలిగించాయి. ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో యాసంగిలోనూ సాగు నీటికి ఇబ్బంది ఉండదు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల నుంచి సమకూరుతున్న రెవెన్యూ గణనీయంగా ఉండటంతో ఇప్పుడు కురిసిన వర్షాలు, భూగర్బ జలాల మెరుగుదల బాగా ఉపయోగపడుతుంది. తాజా వర్షాలతో వరి, పత్తి పంటలకు ఎంత వరకు నష్టం జరిగిందో వ్యవసాయ శాఖ త్వరలో వివరాలను సేకరించి అంచనాకు రానున్నది.

Tags

Next Story