Kothagudem: సంచలనంగా మారిన ఫారెస్ట్ రేంజర్ మరణం..

Kothagudem: సంచలనంగా మారిన ఫారెస్ట్ రేంజర్ మరణం..
Kothagudem: గుత్తికోయల దాడిలో ఓ ఫారెస్ట్‌ రేంజర్‌ చనిపోవడం సంచలనంగా మారింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Kothagudem: గుత్తికోయల దాడిలో ఓ ఫారెస్ట్‌ రేంజర్‌ చనిపోవడం సంచలనంగా మారింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని దట్టమైన అడవిలో ఉంటుందీ ఎర్రబోడు.ఇక్కడ 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గట్టిగా మాట్లాడితే వంద మంది మాత్రమే ఈ గ్రామంలో నివాసం ఉంటారు..వీళ్లంతా 25 సంవత్సరాల క్రితం చత్తీస్ ఘడ్ నుంచి వలస వచ్చిన వాళ్లే. వీరంతా పోడు సాగు చేసుకొని జీవనం సాగు చేస్తున్నారు.



అన్ని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా పోడు భూముల సమస్య ఉంది. అటవీ భూములను నరికి వ్యవసాయం చేయడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం..గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది.కానీ పోడు భూముల వ్యవహారం హత్యల వరకు వెళ్లింది.. ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై.. గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు..

ఇక ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది.. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని, ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. సీఎం డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకుంటుందని అధైర్య పడవద్దంటూ భరోసా ఇచ్చారు.శ్రీనివాసరావు అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు.



సీఎం ఆదేశాలతో అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి,శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు..వారితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారుమరోవైపు శ్రీనివాసరావు హత్యకేసులో పురోగతి సాధించారు పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ వినిత్‌ పరిశీలించారు..


పోడు భూముల వివాదాలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య ఎప్పటినుంచో వివాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి దారుణం ఎక్కడా జరగలేదు. ఏకంగా ఫారెస్ట్ అధికారినే కత్తులతో నరికి చంపిన ఘటనలు మాత్రం ఎక్కడా లేవు.



కానీ ఫస్ట్ టైమ్ ఇలా జరగడంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు గుత్తికోయల దాడి వెనుక మావోయిస్ట్‌ల ప్రోత్సాహం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. గుత్తికోయలకు ఛత్తీస్‌గడ్‌ మిలీషియా సభ్యులకు మధ్య సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story