ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భూదందా.. కామారెడ్డి ఆర్డీవో సస్పెన్షన్

కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ పట్టుబటిన ఘటన మరవకముందే... ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భూదందా బయటపడింది. రెవెన్యూశాఖలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూదందాల్లో కీలకంగా వ్యవహరించి... ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా పనిచేస్తున్న జి.నరేందర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో జి.నరేందర్ సంగారెడ్డి జిల్లా జిన్నారంలో తహసీల్దార్‌గా పని చేశారు. ఆ సమయంలో... 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి కట్టబెట్టిన వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు విచారణ నివేదికలో స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో.. జి.నరేందర్‌ను సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భూముల అక్రమ కేటాయింపు వ్యవహారంలో జిన్నారం మాజీ డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణపైనా ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం మెదక్ కలెక్టరేేట్‌లో కె.నారాయణ డిప్యూటీ తసహీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఖాజీపల్లి వీఆర్వో వెంకటేశ్వరరావు, జిన్నారం ఆర్‌ఐ విష్ణువర్ధన్, సర్వేయర్ లింగారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరరావు, సూపరింటెండెంట్ సహదేవ్‌పైనా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com