Dharmapuri Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. డి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. రేపు నిజామాబాద్ లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్ లోని ఆయన నివాసానికి డీఎస్ పార్థివదేహాన్ని తీసుకురానున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు డి.సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డి.శ్రీనివాస్ 1989, 99, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com