TPCC: కాంగ్రెస్ తెలంగాణ ఇన్​ఛార్జ్​గా మీనాక్షి నటరాజన్

TPCC: కాంగ్రెస్ తెలంగాణ ఇన్​ఛార్జ్​గా మీనాక్షి నటరాజన్
X
కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం... రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలిగా ఉన్న మీనాక్షి

ఊహాగానాలు నిజమయ్యాయి. కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్​చార్జ్​గా సీనియర్ నేత, రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలు మీనాక్షి నటరాజన్​ను పార్టీ హైకమాండ్ నియమించింది. ప్రస్తుత ఇన్​చార్జ్​ దీపాదాస్​మున్షీ స్థానంలో మీనాక్షికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రాలకు కొత్త ఇన్​చార్జ్​లను నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఇన్​చార్జ్​గా కె.రాజుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్ర ఇన్​చార్జ్​గా పార్టీ సీనియర్ నేత కృష్ణ అళ్లవారును నియమించారు. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ బాధ్యతలు రజనీ పాటిల్​కు అప్పగించారు.

మిగిలిన రాష్ట్రాలకు కూడా...

హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఇంఛార్జిగా రజనీ పాటిల్‌.. హరియాణా- బీకే హరిప్రసాద్‌, మధ్యప్రదేశ్‌ - హరీశ్‌ చౌదరి, తమిళనాడు, పుదుచ్ఛేరి- గిరీశ్‌ చోడాంకర్‌; ఒడిశా - అజయ్‌ కుమార్‌ లల్లూ, జార్ఖండ్‌ - కె.రాజు; మణిపుర్‌, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌ - సప్తగిరి శంకర్‌ ఉల్కా, బిహార్‌ -కృష్ణ అల్లవారులను నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

మీనాక్షి నటరాజన్ నేపథ్యం ఇదే

మీనాక్షి మధ్యప్రదేశ్‌లోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఆమె 2009 నుంచి 2014 వరకు మాండ్సౌర్ నుండి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. 1999 నుంచి 2002 వరకు NSUI అధ్యక్షురాలిగా పనిచేశారు. 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008లో రాహుల్ గాంధీచే AICC కార్యదర్శిగా ఎంపికయ్యారు.

దీపా దాస్ మున్షీపై వేటు అందుకేనా..?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా దీపా దాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ నియమించింది. అయితే దీపాదాస్ మున్షీ తీరుతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని.. ఆమెను మార్చాలంటూ హైకమాండ్‌ దృష్టికి తెలంగాణ నేతలు తీసుకెళ్లారు. దీంతో.. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి నష్టం జరగకుండా కీలక మార్పు చేసింది.

Tags

Next Story