Telangana news: పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు..

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ తెలంగాణలో మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకుని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అనంతరం హోటల్ బయటకు వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సర్పంచులు సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లుల కోసం పోరుబాటపట్టారు. చల్ హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైన మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు గుండి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య, గుర్రాలదండి ఆంజనేయులు, దుంప ఆంజనేయులుతోపాటు పలువురు మాజీ సర్పంచులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా, తమ పదవీకాలం ముగిసి 9 నెలలు కావస్తున్నా పెండింగ్ బిల్లుల విడుదల చేయడం లేదని మాజీ స్పరంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల విడుదల కోసం ఇప్పటికే గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత ఆగస్టులో అసెంబ్లీని ముట్టడించారు. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన వారని పోలీసులు అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com