forum for good governance: ఎన్నికల బరిలో భారీగా నేర చరితులు

forum for good governance: ఎన్నికల బరిలో భారీగా నేర చరితులు
కాంగ్రెస్‌ అభ్యుర్థుల్లో 84 మంది నేర చరితులు... బీజేపీ నుంచి 78 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 58 మందికి నేర చరిత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో చాలా మంది నేర చరితులున్నట్లు సుపరిపాలనా వేదిక వెల్లడించింది. భూఆక్రమణ, బెదిరింపులు, మోసం వంటి కేసులు నమోదైన వాళ్లూ.. పోటీలో ఉన్నారని తెలిపింది. అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లను క్రోడీకరించిన సుపరిపాలనా వేదిక‍(ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌) పార్టీల వారీగా నేరచరితుల జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎంత మంది నేర చరిత్ర ఉన్నారని సుపరిపాలనా వేదిక లెక్క తీసింది. అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగా వివరాలను సేకరించింది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో 360 మంది ఉండగా అందులో 226 మందికి నేర చరిత్ర ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నేర చరితులు బరిలో ఉండగా బీజేపీ రెండు, బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఉన్నట్లు సుపరిపాలనా వేదిక వెల్లడించింది. కొంత మంది అభ్యర్థులపై తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులున్నాయి.


ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వంటి కేసులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 84 మంది, బీజేపీ నుంచి 78 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 58 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురికి నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. వీరిలో సగం మంది గెలిచినా శాసనసభ నేరచరితులతో నిండిపోయే ప్రమాదం ఉంటుందని సుపరిపాలనా వేదిక అధ్యక్షులు పద్మనాభ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీకి డబ్బు, కులం ప్రధానాంశాలుగా మారాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.40 కోట్లు ఖర్చు పెడుతున్న తీరుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే చెబితేనే పోలీస్‌ స్టేషన్లలో కేసుల నమోదు, తొలగింపు, విచారణ జరుగుతోందన్నారు.

అత్యధికంగా కాంగ్రెస్ కొడంగల్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై చెరో 89 కేసులున్నాయని సుపరిపాలన వేదిక తెలిపింది. బండి సంజయ్‌పై 59 కేసులు, భోథ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై 55, ఖానాపూర్ కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జుపై 52, హుజురాబాద్‌, గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 44 కేసులున్నట్లు వివరించింది. పార్టీలు నేరచరితులకే పెద్దపీట వేస్తే యువతలోకి తప్పుడు సంకేతం వెళ్తుందని సుపరిపాలన వేదిక ఆందోళన వ్యక్తంచేసింది. నేర చరిత ఉన్న అభ్యర్థులు.. తమ గురించి ఓటర్లకు తెలియజేసేలా ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలని ఈ నిబంధనలన్నీ అమలయ్యేలా ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని సుపరిపాలనా వేదిక కోరింది.

Tags

Read MoreRead Less
Next Story