పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్.. భారత ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం‌

పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్.. భారత ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం‌
ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌కు ఫ్రాన్స్‌ షాకిచ్చింది. పాతబడిన మిరేజ్ యుద్ద విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అగొస్టా 90బి క్లాస్ జలాంతర్గాములను ఆధునికీకరించాలని..

ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌కు ఫ్రాన్స్‌ షాకిచ్చింది. పాతబడిన మిరేజ్ యుద్ద విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అగొస్టా 90బి క్లాస్ జలాంతర్గాములను ఆధునికీకరించాలని పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఫ్రాన్స్ తిరస్కరించింది. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది. రఫేల్‌ యుద్ధ విమానాలను మరమ్మతు చేయించేటప్పుడు.. పాక్‌ మూలాలున్న సాంకేతిక నిపుణులను దగ్గరకు రానివ్వొద్దని ఖతార్‌కు స్పష్టం చేసింది. ఈ తిరస్కరణ వెనుక మరొక కారణం మన దేశంతో ఫ్రాన్స్‌కుగల వ్యూహాత్మక సత్సంబంధాలు కూడానని తెలుస్తోంది.

కొన్నాళ్ల క్రితం ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులు జరిగాయి. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ స్పష్టం చేశారు. ఆ సమయంలో భారత్‌ సహా అనేక దేశాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ‌మాత్రం భిన్నంగా స్పందించారు. మనుషులందరినీ ఐకమత్యంగా ఉంచడమే నాయకుడి అసలైన బాధ్యత... అతివాదులకు తావులేకుండా అధ్యక్షుడు మెక్రాన్‌ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదేనంటూ వ్యాఖ్యానించాడు. మత ప్రవక్త, ఇస్లాంను అర్థం చేసుకోకుండా కార్టూన్లు ప్రదర్శించే వారిని అడ్డుకోకుండా ఐరోపా, ప్రపంచంలోని ముస్లింల సెంటిమెంటును మెక్రాన్‌ గాయపరిచారని విమర్శించారు. అందుకే ఇప్పుడు పాక్‌పై మెక్రాన్‌ బదులు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

పాకిస్థాన్‌ వాయుసేనలో ఎక్కువగా మిరేజ్‌ 3, మిరేజ్‌ 5 యుద్ధ విమానాలే ఉన్నాయి. ఫ్రెంచ్‌ కంపెనీ దసాల్ట్‌ ఏవియేషన్‌ వీటిని తయారుచేసింది. ప్రస్తుతం పాక్‌ వద్దనున్న మిరేజ్‌ విమానాల్లో సగం రిపేర్ల బారిన పడ్డాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌ వీటి అప్‌గ్రేడ్‌కు నిరాకరించడంతో పాక్‌ వాయుసేనపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా గగన రక్షణ వ్యవస్థ, ఆగోస్టా 90బి' తరగతి జలాంతర్గాముల్ని అప్‌గ్రేడ్‌ చేసేందుకు నిరాకరించింది. రఫేల్‌ యుద్ధ విమానాల మరమ్మతుల సమయంలో పాక్‌ మూలాలున్న సాంకేతిక నిపుణులను రానీయొద్దని ఖతార్‌కు ఫ్రాన్స్‌ స్పష్టం చేసింది. రఫేల్‌ విమానాల కొనుగోలు సమయంలోనే వీటి రహస్యాలను బయటవారికి తెలియనివ్వకూడదని భారత్‌ విజ్ఞప్తి చేయడమే ఇందుకు కారణం. సరిహద్దుల్లో మన దేశ ప్రయోజనాలకు భంగం కలగకూడదని ఫ్రాన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story