Osmania Hospital : నగరంలో ఉచితంగా డయాబెటిక్ ఫుట్ కేర్ సేవలు

Osmania Diabetic Foot care : ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సేవలు.. మధుమేహ బాధితులకు వరంగా మారింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలకు వేలు ఖర్చు అయ్యే ఈ వైద్యసేవలను.. ఉస్మానియాలో మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. ప్రారంభించిన నెలరోజుల్లోనే సుమారు 600 మంది ఈ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యం సేవలు పొందారు.
డయాబెటిస్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన శరీరంలో మిగితా అవయవాలపై ప్రభావం చూపుతుంది. గుండె, కళ్లు, మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాళ్లు, చేతుల్లో సక్రమంగా రక్త ప్రసరణ లేక స్పర్శ కోల్పోతారు. ఇక కాస్త దెబ్బ తగిలినా చాలు.. ఒక్కోసారి ఆ భాగాలు తొలగించాల్సి వస్తుంది. పరిస్థితి అంత వరకు రాకుండా ఉండేందుకే.. ఉస్మానియాలో డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్ తీసుకొచ్చారు.
మధుమేహ బాధితుల పాదాలపై ఏర్పడిన పుండ్లు వెంటనే మానకపొతే గనక.. క్రమంగా వేళ్లు, పాదాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. పాదాల్లోని నాడులు దెబ్బతిని స్పర్శ కోల్పోవడం వల్ల దెబ్బ తగిలినా గమనించలేరు. అలాంటి వారికి తమ దగ్గర కార్పొరేట్ తరహా వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని ఉస్మానియా వైద్యులు అంటున్నారు. వచ్చిన రోగి అన్ని చోట్లకు తిరగకుండా మంచి వైద్యం అందిస్తున్నామని చెబుతున్నారు.
డయాబెటిక్ గాయాల కారణంగా కాళ్లు తీసేయకుండా, గాయం పెద్దగా కాకుండా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. గాయాల కారణంగా శరీర భాగాలు తీసేయకుండా రోగి నుంచే కొంత స్కిన్ తీసి సంపూర్ణ వైద్యం అందిస్తారు. అవసరమైతే ఇతర సర్జరీలు కూడా చేస్తున్నారు. ఎవరికైనా కొత్త చర్మం కావాలి అంటే హాస్పిటల్‌లో ఉన్న స్కిన్ బ్యాంక్ నుంచి సేకరిస్తామని చెబుతున్నారు.
మధుమేహ రోగులకు ఈ ఫుట్ కేర్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని వారికి.. కాలు, వేళ్లు తీసేయాల్సినంత పరిస్థితి ఉన్నవారికి అన్ని విభాగాల సమన్వయంతో ఉచితంగా వైద్యం అందిస్తున్నామంటున్నారు ఉస్మానియా వైద్యులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com