TG: గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం

TG: గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
X
తెలంగాణలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు... అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం

ఎడతెరపిలేని వానలతో తెలంగాణలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఏం రేవంత్‌రెడ్డి సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 29.3, చిలుకూరులో 28.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు కూడా అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపైకి చెరువు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వద్ద కూడా రోడ్డు బ్లాక్‌ అయ్యింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి నుంచి వయా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా తరలిస్తున్నారు. మధిర మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరొచ్చింది. సత్తుపల్లిలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మధిర మండలం కిష్టాపురం వద్ద పాలవాగు పొంగి ప్రవహించడంతో సాయంత్రం వైరా, మధిర మధ్య రాకపోకలు నిలిపివేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలో మల్లెపల్లి వద్ద వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరదలో ఓ కారు చిక్కుకోగా స్థానికులు వచ్చి అందులోని ప్రయాణికులను రక్షించారు.

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌

మహబూబాబాద్‌ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గం మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబాబూబాద్‌ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తుండడంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వాటిని ఆపేశారు. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌కు వరద తాకింది. దీంతో పందిళ్లపల్లి వద్ద 4 గంటలపాటు మహబూబ్‌నగర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది.

Tags

Next Story