TS ELECTION: పార్టీల హోరు.. ప్రచార జోరు

తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. పండుగ రోజున సైతం అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్ల వేట సాగిస్తున్నారు. ప్రగతి పాలనను కొనసాగించేందుకు మరోసారి అవకాశమివ్వాలంటూ బీఆర్‌ఎస్ నేతలు ఓట్లడుగుతున్నారు. సంక్షేమ పాలనతో ఇందిరమ్మరాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ గడపగడపకూ తిరుగుతోంది. బడుగు, బలహీన వర్గాలను పెద్దపీట వేస్తామంటూ బీజేపీ జనాల్లోకి వెళ్తోంది. హ్యాట్రిక్ విజయాలతో రాష్ట్రాన్ని గులాబీ కంచుకోటగా మార్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఖైరతాబాద్‌లో ప్రచారం నిర్వహించిన దానం నాగేందర్‌కు ముస్లిం మహిళలు దట్టీ చేతికి కట్టి భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో బీఆర్‌ఎస్‌సంక్షేమ పథకాలను వివరిస్తూ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈనెల 14న ఇబ్రహీం పట్నంలోని ఖానాపూర్ గేట్ వద్ద జరిగే KCR సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మరోపక్క రాజేంద్రనగర్ నియోజకవర్గంలో MIM అభ్యర్థి స్వామి యాదవ్ ఇంటింటికి తిరుగుతూ పతంగి గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గొల్లమడ గ్రామంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి రోడ్‌షోలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంక్షేమ పథకాలు అందించలేదంటూ బీజేపీ నేతలు MLAకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని నాగారం గ్రామంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ రైతు పొలంలో మోటార్ స్విచ్ఛాన్ చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలంలో నోముల భగత్ తరపున ఆయన సతీమణి నోముల భవాని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ రోడ్‌షోలు, పాదయాత్రలతో మరోసారి బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని కోరారు. ఆరు గ్యారంటీలతో అధికారాన్ని చేజిక్కించుకునేలా హస్తం పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది.
అగ్రనేతల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. నియోజకరవర్గాల వారీగా తిరుగుతున్న రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. సిద్దిపేటలో ప్రచారం నిర్వహించిన పూజల హరికృష్ణ బ్యాండ్ వాయిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో చింతకుంట విజయ రమణారావు ఎలిగేడు మండలంలో ఆరు గ్యారంటీల కార్డుతో ప్రచారం నిర్వహించారు. బలహీన వర్గాల ఓటర్లే లక్ష్యంగా భాజపా ఎన్నికల బరిలోకి దిగింది. BC ముఖ్యమంత్రి ప్రకటన సహా SC వర్గీకరణకు సై అంటూ జనాల్లోకి వెళ్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించేలా కమలనాథులు ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి సెలూన్ షాప్‌లో కటింగ్ చేస్తూ ఓట్లడిగారు. మహేశ్వరం నియోజకవర్గంలోని RKపురం డివిజన్లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో చీకొటి ప్రవీణ్ సహా బీజేపీ అభ్యర్థి అందేల శ్రీరామ్ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com