విశ్రాంత ఉపాధ్యాయుడి ఉదారం.. మరణించిన భార్య పేరిట పాఠశాలకు లక్ష విరాళం
పెద్దపల్లిలోని పాఠశాలకు విశ్రాంత ఉపాధ్యాయుడు రూ.లక్ష విరాళం అందజేశారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు, క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు ఇటీవల మరణించిన తన భార్య అహల్య పేరిట పాఠశాలకు రూ.లక్ష విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.
తాను చాలా కాలంగా పాఠాలు చెప్పిన పాఠశాలకు విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష విరాళం అందించారు. ఈ మొత్తాన్ని ఇటీవల మరణించిన తన భార్య పేరిట పాఠశాల అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు.
ఈ ఘటన ఓదెల మండలం మడక ప్రాథమిక పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. మడకకు చెందిన శ్రీ భాష్యం రాఘవులు మడక ప్రాథమిక పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ పొందారు. విరాళం మొత్తాన్ని ఆయన బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ తాను ఎంతో కాలంగా పనిచేస్తున్న పాఠశాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
కావున గ్రామస్తులు పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది రాఘవులును అభినందించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com