SAD: ప్రమాదం కాదు.. ప్రేమికుల ఆత్మహత్య

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో కారు దగ్ధమై ఇద్దరు సజీవదహనమైన ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో కారులో ఉన్న జంట సజీవదహనం అయ్యారు. ఇది ప్రమాదంగా తొలుత భావించారు. అయితే పోలీసు విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ దుర్ఘటన ప్రమాదశాత్తు జరిగింది కాదని పోలీసులు తేల్చారు. ఇద్దరూ ప్రేమికులని.. ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. సజీవ దహనమైన జంట శ్రీరామ్, లిఖితగా తేల్చిన పోలీసులు... వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారని వెల్లడించారు. ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో లిఖిత ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక శ్రీరామ్.. ఘట్‌కేసర్ నారపల్లిలో సైకిల్ షాపు నడుపుతున్నాడు. అయితే ప్రేమికులిద్దరూ రహస్యంగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తులు.. శ్రీరామ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు శ్రీరామ్ తన సోదరికి ఫోన్ చేసి ఇద్దరం చనిపోతున్నట్లు తెలిపాడు. అనంతరం ఘట్‌కేసర్‌లోని ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర కారులో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు 3 పేజీల ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ నడిపిస్తున్న సైకిల్ షాపు పక్కనే లిఖిత నివాసం ఉంటుంది. మృతులు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com