గ్రేటర్ ఎన్నిలు.. గడువు తర్వాత ప్రచారం నిర్వహిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష

నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సాగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సాయంత్రంతో తెరపడనుంది. బల్దియా మే సవాల్ అంటూ హోరాహోరీగా సాగిన ప్రచారం సాయంత్రం ఆరు గంటలకు పరిసమాప్తం కానుంది..గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండింటిని విధించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ స్పష్టం చేశారు. గడువు ముగిశాక ఎన్నికలకు సంబంధించిన సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, టెలివిజన్, సినిమాటోగ్రఫీ ద్వారా ప్రసారాలు చేయరాదని హెచ్చరించారు. గడువు ముగిసిన వెంటనే మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందన్నారు.
ఇన్నాళ్లు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన అభ్యర్థులు.. చివరి రోజు వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించి, ఎక్కువ మందిని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుల, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలపై దృష్టి సారించారు. వివిధ జిల్లాల నుంచి తమకు మద్దతుగా వచ్చిన నాయకులు, స్థానిక కార్యకర్తలను కాలనీలు, బస్తీల వారీగా వేర్వేరుగా తిప్పుతున్నారు. కొందరైతే నగదు, చీరలు, వివిధ రకాల వస్తువులు, బహుమతులను పంపిణీ చేస్తున్నారు
గ్రేటర్‌లో రెండోసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్, గులాబీ పార్టీని ఓడించి గోల్కొండపై కాషాయ జెండాను ఎగురవేస్తామని బీజేపీ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నాయి..మొత్తం 150 డివిజన్లలో 148 స్థానాల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ మెజార్టీ సీట్లను చేజిక్కించుకుని టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని ప్రయత్నిస్తోంది. ఎంఐఎం తన సంప్రదాయ సీట్లను మరోసారి పొందేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది.
ఇక టీఆర్‌ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కీలక నేతలంతా రోడ్ షోలు.. బహిరంగ సభలతో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. నిన్న టీఆర్‌ఎస్ తరుపున సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించి.. బీజేపీపై నిప్పులు చెరిగారు.. బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షోలు నిర్వహించారు.. ఇవాళ నేరుగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రచారం రంగంలోకి దిగుతున్నారు.
డిసెంబరు 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 4న లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. పోలింగ్‌కు ఓటరు గుర్తింపుకార్డు లేకున్నా ప్రత్యామ్నాయ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ప్రతీ ఒక్క ఓటరు గుర్తింపు నిర్ధారణకు గాను ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. పోలింగ్ రోజున అభ్యర్థికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఓ వైపు భారీగా పోలింగ్ జరగాలని ప్రధాన పార్టీలు కోరుకుంటున్నాయి.. అటు అధికారులు సైతం ఓటింగ్ శాతన్ని పెంచడానికి అవగాహన కల్పిస్తున్నారు. అయితే వరుస సెలవులు కాస్త టెన్షన్ పెడుతున్నాయి. వరుసగా ఉద్యోగులకు మూడు, టెక్కీలకు నాలుగు రోజులు సెలవులు రావడంతో పోలింగ్ రోజున నగర వాసులు అందుబాటులో ఉంటారా? లేదా? అని అభ్యర్థులు గుబులు పడుతున్నారు. శని, ఆది, సోమవారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు. ఇక.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వీకెండ్‌తో పాటు సోమ, మంగళవారం సెలవులు కలిసొచ్చాయి. ఇది ఓటింగ్ శాతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com