గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్

గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తుది జాబితాను విడుదలచేసింది. 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ జాబితాలో మేయర్ బొంతు రామ్మోహన్ భార్యకు చర్లపల్లి టికెట్, ఉప్పల్ ఎమ్మెల్యే భార్యకు హబ్సిగూడ టికెట్, మరో ఎమ్మెల్యే సాయన్న కూతురుకు కవాడిగూడ టికెట్ దక్కింది. వెంగళరావునగర్‌లో సిట్టింగ్ కార్పొరేటర్ జంప్‌తో దేదీప్యరావుకు టికెట్ ఇచ్చారు. తార్నాకలో సిట్టింగ్‌ను మార్చి మోతె శ్రీలతను బరిలో నిలిపారు. దీంతో సీటు దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు బయలుదేరారు.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది. తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మిగిలిన 25 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 150 డివిజన్ల అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com