తారాస్థాయికి చేరిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం

గ్రేటర్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నేతల మధ్య మాటల తుటాలతో ప్రచారం వేడెక్కింది. ప్రచారానికి తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ఆయా పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. పాతబస్తీల్లో రోహింగ్యాలు ఉన్నారని ఆరోపిస్తున్నారని.. మరీ వారికి ఆధార్ కార్డులు ఇచ్చింది కేంద్రం కాదా అని నిలదీశారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కనబడని బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి మాత్రం వస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు నిర్వహిస్తున్న రోడ్‌షోలో మాట్లాడిన నడ్డా.. హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రతీ డివిజన్‌లో కమలం వికసించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని చెప్పారు.
మూసారాంబాగ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతుగా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని ఉత్తమ్ తెలిపారు.
ఏఎస్‌రావు నగర్‌లో జరిగిన రోడ్‌షోలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది టీడీపీయేనన్నారు.. గ్రేటర్‌లో టీడీపీ సత్తా ఏంటో రోడ్‌షోలకు వస్తున్న ఆదరణ చూస్తే తెలుస్తుందని అన్నారు.
మొత్తానికి గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com