డిసెంబర్ 4న గ్రేటర్ ఎన్నికలు ఉండే అవకాశం?

గ్రేటర్ ఎన్నికలు దూసుకొచ్చాయి.. దీపావళి తరువాత ఏక్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.. ఇవాళ ఓటరు తుది జాబితా విడుదల కానుంది.. ఈ నెల 21న పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల కానుంది. ఈ లోపే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఎలక్షన్ కమిషన్.. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకుంది. వీలైనంత త్వరగా ఎన్నికలు ముగించాలనుకుంటోంది. అన్నీ అనుకూలిస్తే దీపావళి వెళ్లగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రచారానికి ఈసారి తక్కువ సమయమే ఉండేట్టు కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు సైతం డిసెంబర్ 4నే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. వార్డుల వారీగా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎలక్షన్ కోడ్, అభ్యర్థుల వ్యయం అంశాలపై పార్టీల నేతలు ఎన్నికల కమిషన్‌తో చర్చించారు.
దుబ్బాక ఓటమితో గ్రేటర్ ఎలక్షన్‌లపై అధికార పార్టీ ఇంకాస్త ఫోకస్ చేసింది.. నిన్న అత్యవసరంగా మంత్రులు, పార్టీ కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. దుబ్బాకలో బీజేపీ గెలుపును పట్టుంచుకోవద్దని సూచించారు. అది ఒక చేదు గుళిక మాత్రమే అన్నారు.. అయితే ఏ మాత్రం ఏమరపాటు లేకుండా.. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో అంతా ఉండాలని సూచించారు.. ఎన్నికల ఇన్‌ఛార్జీగా మంత్రి కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌లో బీజేపీ ఆటలు సాగవన్నారు.. అలాగే మిత్రపక్షం ఎంఐఎంతో కూడా సమావేశమై.. గ్రేటర్ వ్యూహాలపై చర్చించారు..
దుబ్బాక విక్టరీతో గ్రేటర్ సమరం పూరిస్తోంది కాషాయ పార్టీ.. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మేం సిద్ధమంటోంది. గ్రేటర్ లోనూ కారును పరుగులు పెట్టిస్తామంటోంది.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కొంపల్లిలోని మేడ్చల్ అర్బన్ జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సమావేశానికి కీలక నేతలు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్‌లు హాజరయ్యారు. ఒక్కసారి భాగ్యనగరంలో అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామంటోంది బీజేపీ. ఈ ఎన్నికలను తెలంగాణకు భవిష్యత్తుగా ఓటర్లు భావించాలని బీజేపీ నేతలు ఓటర్లకు పిలుపు ఇస్తున్నారు.
దుబ్బాక ఎన్నికల్లో ఘోరంగా మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్.. GHMC ఎలక్షన్‌ల్లో అలాంటింది రిపీట్ కాకుడదని కోరుకుంటోంది.. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. డివిజన్ల వారీగా నాయకులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటూ స్థానిక కమిటీల ఏర్పాటు ప్రక్రియలో స్పీడ్ పెంచింది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో కాంగ్రెస్ తన యాక్షన్ ప్లాన్‌కు పదును పెడుతున్నారు హస్తం నేతలు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారు. డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయి సమస్యలను గుర్తించి పరిష్కారం చేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని స్పష్టం చేస్తున్నారు. అవసరమైన చోట ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను పీసీసీ ఆదేశించింది.
ఇక ఎంఐఎం, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు సైతం గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.. ముఖ్యంగా MIM మేయర్ పీఠాన్ని షేర్ చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. పాతబస్తీలో ఆ పార్టీకి పూర్తి పట్టు ఉంది.. ఇతర ప్రాంతాల్లో కూడా పాగా వేయాలని భావిస్తోంది. గతంలోలా టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో.. ఈ సారి మేయర్ పీఠాన్ని షేర్ చేసుకునే విధంగా అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇటు టీటీపీ సైతం గత వైభభం కోసం పాటు పడుతోంది. ఒకప్పుడు గ్రేటర్ ఎన్నికలు అంటే టీడీపీ ఫుల్ జోష్‌లో ఉండేది.. గత ఎన్నికల తరువాత పార్టీకి అభ్యర్థులే లేని పరిస్థితి.. అయితే సెటిలర్స్ ఎక్కువమంది ఉండడంతో.. టీడీపీ ఓటు బ్యాంక్ ఇప్పటికీ కొన్ని చోట్ల చెక్కు చెదరకుండా ఉండడంతో.. మరోసారి GHMCపై ఫోకస్ చేసింది టీడీపీ..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com